బ్రెయిన్​డెడ్​ పేషెంట్​​అవయవాలు అమ్ముకున్నరు

  • పుణ్యం వస్తుందని భార్యకు మాయమాటలు 
  • రూ. 3 లక్షలు ఇచ్చి  మిగతాదంతా కొట్టేశారు
  • డాక్టర్లు, అంబులెన్స్​ డ్రైవర్ల పాత్ర  
  • ప్రాథమిక ఎంక్వైరీలో నిజమేనని తేల్చిన మంచిర్యాల పోలీసులు
  • మానవ అవయవాల అక్రమ రవాణా కోణంలో విచారణ 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం శెట్​పల్లికి చెందిన ఓ యువకుడు కొద్ది రోజుల కింద రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్​డెడ్​కాగా, కొంతమంది వ్యక్తులు అతడి భార్యకు మాయమాటలు చెప్పి అతడి అవయవాలు అమ్ముకున్నారు. పుణ్యం వస్తుందని, హాస్పిటల్​ బిల్లు కూడా లేకుండా చేస్తామని, రూ. 3 లక్షలు ఇప్పిస్తామని నమ్మించారు. ఇందులో అంబులెన్సు డ్రైవర్లు, కొందరు డాక్టర్లు కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న బ్రెయిన్​డెడ్​ అయిన యువకుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు జరుపుతున్నారు.

గ్రామానికి చెందిన రేవెల్లి శ్రీకాంత్(35) మంచిర్యాలలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో ఓటీ టెక్నీషియన్. ఈ నెల 6న డ్యూటీ తర్వాత ఇంటికి వస్తూ బైక్​ యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు, అక్కడి నుంచి కరీంనగర్​లోని మరో దవాఖానకు తరలించారు. శ్రీకాంత్​కు​ బ్రెయిడ్​డెడ్ ​అయినట్టు చెప్పిన డాక్టర్లు.. హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్​కు రెఫర్​ చేశారు. అయితే మధ్యలో కొంతమంది అంబులెన్స్​ డ్రైవర్లు జోక్యం చేసుకొని తాము శ్రీకాంత్ ​ ఫ్రెండ్స్​ అని చెప్పారు. యశోద హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​కు ఎక్కువ ఖర్చవుతుందని, కామినేని హాస్పిటల్​లో తక్కువ ఖర్చుతోనే ట్రీట్​మెంట్​ చేయిస్తామని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. 

చేతులు మారిన రూ. లక్షలు

ఈ నెల 8న బ్రెయిన్​డెడ్​ అయినట్టు చెప్పిన డాక్టర్లు, కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు శ్రీకాంత్​ అవయవాలు దానం చేసేలా అతడి భార్య స్వప్నను ఒప్పించారు. మొదట ఒప్పుకోకపోయినా మాయమాటలు చెప్పి మానసికంగా సిద్ధం చేశారు. ఎన్ని రోజులు ఉంచినా డబ్బులు ఖర్చు కావడమే కానీ ప్రయోజనం ఉండదని, ట్రీట్​మెంట్​కు అయ్యే ఖర్చు భరించలేవని చెప్పారు. లివర్, కిడ్నీలు, లంగ్స్​ గుండె, కార్నియా లాంటి అవయవాలు దానం చేస్తే మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు.

పైగా హాస్పిటల్​ బిల్లులు లేకుండా చేస్తామని, రూ.3 లక్షలు కూడా ఇస్తామని చెప్పడంతో స్వప్న ఒప్పుకుంది. తర్వాత శ్రీకాంత్​ నుంచి ఏడు అవయవాలను జీవన్​దాన్ ట్రస్టు ద్వారా సేకరించారు. తర్వాత తన భర్త అవయవాల దానానికి సంబంధించి లక్షల రూపాయలు చేతులు మారాయని..డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లు బాడీ పార్ట్స్​ అమ్ముకున్నారని తెలుసుకున్న శ్రీకాంత్ ​భార్య స్వప్న  మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ బన్సీలాల్ ​మంగళవారం హైదరాబాద్​లోని కామినేని హాస్పిటల్​కు వెళ్లి విచారణ జరిపారు. 

నిజంగానే లక్షల రూపాయలు చేతులు మారినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుటుంబసభ్యులు, డాక్టర్లు, అంబులెన్స్ ​డ్రైవర్లతో పాటు జీవన్​దాన్ ​ట్రస్ట్​ ప్రతినిధుల పాత్రపై లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. మానవ అవయవాల అక్రమ రవాణా కోణంలో  విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. కాగా, గతంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చే కమీషన్లకు ఆశపడి పేషెంట్ల చావుకు కారణమైన అంబులెన్సు డ్రైవరే ఈ దందాలో కీలక సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఇతనిపై ఇదివరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసులున్నాయి.