బెల్లంపల్లి రైల్వే స్టేషన్​లో డీఆర్​ఎం తనిఖీలు

బెల్లంపల్లి, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ భరత్ కుమార్ జైన్ శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక రైల్వే అధికారులతో కలిసి రైల్వే స్టేషన్​లోని ఆర్వో హెచ్ డిపో షెడ్, రన్నింగ్ రూమ్, సీ అండ్ డబ్ల్యూ విభాగాలతోపాటు సిక్ లైన్ షెడ్ విస్తరణ పనులను పరిశీలించారు. రన్నింగ్ రూమ్​ను పూర్తిస్థాయిలో విస్తరించాలని ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రైల్వే స్టేషన్​లోని పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఆర్ఎంకు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ జీఎస్ఎన్​వీ ప్రసాద్ వినతి పత్రం అందజేశారు. రైల్వే హాస్పిటట్​ను అభివృద్ధి చేయాలని, కార్మికులకు క్వార్టర్లు నిర్మించాలని కోరారు. అనంతరం డీఆర్​ఎం పట్టణంలోని రైల్వే కాలనీలో పర్యటించి క్వార్టర్లలో ఉన్న సమస్యలను రైల్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులున్నారు.