సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం డ్రోన్ సర్వే : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన అమృత్ 2.0 పథకంలో మంచిర్యాల మున్సిపాలిటీ ఎంపికైన నేపథ్యంలో సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్​ఎస్ బాలుర స్కూల్ ​డ్రౌండ్​లో వరంగల్ ​టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్​తో కలిసి డ్రోన్ సర్వేను కలెక్టర్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నివాస, వాణిజ్య, వ్యవసాయ భూముల గుర్తింపు, అభివృద్ధి, ఇతర అంశాల పరిశీలనకు డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నివేదిక అందిన అనంతరం దానికి అనుగుణంగా మార్పులు చేసి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామ న్నారు. 

మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్​గా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో సర్వే ద్వారా భూముల సమాచారం కూడా సేకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకుడు పోటు రవీందర్​ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజ్వీరు, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.