పునరావాస గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాలి

  • అధికారులకు కలెక్టర్ ఆదేశం

నిర్మల్, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ పునరావాస గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కవ్వాల్ ఫారెస్ట్ పునరావాస గ్రామాలైన రాంపూర్, మైసంపేట్ ప్రజలకు కల్పిస్తున్న వసతులు, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం సాయంత్రం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పునరావాస గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. 

ప్రజల సంక్షేమంతో పాటు కవ్వాల్ అడవులను పరిరక్షించాలన్నారు. రహదారులు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయం, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు మంచి విద్య అందించాలన్నారు. అటవీ భూముల రక్షణ, పర్యావరణం, ప్రకృతి వనరుల పునరుద్ధరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కల్యాణి, డీఎఫ్​వో నాగిని భాను, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.