- నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
భైంసా, వెలుగు: భైంసా పట్టణంలో జరిగే గణేశ్‌నవరాత్రి ఉత్సవాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం భైంసాలోని గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. ఆయా కాలనీల్లో ప్రతిష్ఠించే గణేశ్ మండపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గడ్డెన్న ప్రాజెక్టు వద్ద నిమజ్జన స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర మార్గంలో కరెంటు తీగలు సరి చేసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై కమిషనర్రాజేశ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, హాస్పిటల్‌కు వచ్చే రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్సూచించారు. కలెక్టర్ వెంట ఏఎస్పీ అవినాష్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, కమిషనర్ రాజేశ్ కుమార్, సీఐ రాజారెడ్డి, సూపరింటెండెంట్ డా. కాశీనాథ్, పలు శాఖల అధికారులు ఉన్నారు.