- మెదక్ జిల్లాలో భారీగా నగదు, లిక్కర్, కూల్డ్రింక్స్సీజ్
- ఖమ్మం జిల్లా దేవునితండా దగ్గర రూ. కోటి పట్టివేత
- చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి
వెలుగు నెట్వర్క్: పార్లమెంట్ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా 24 గంటల ముందు నుంచి వివిధ నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీలు ప్రలోభపర్వానికి తెరతీశాయి. పలుచోట్ల ఓటుకు రూ.200 నుంచి రూ.500, క్వార్టర్, కూల్‌డ్రింక్ బాటిల్స్ పంచినట్లు ఆరోపణలు వచ్చాయి. మెదక్ , సిద్దిపేటలాంటి జిల్లాల్లో బీఆర్ఎస్లీడర్లను కాంగ్రెస్, బీజేపీ లీడర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎలక్షన్ టీమ్‌లు, పోలీసులు పలుప్రాంతాల్లో దాడులు చేసి డబ్బు, లిక్కర్, కూల్‌డ్రింక్స్ సీజ్ చేశారు. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచుతున్నా ఎన్నికల అధికారులు చోద్యం చూస్తున్నారని కరీంనగర్, మెదక్బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్, రఘునందన్‌రావు ఆరోపించారు.
ఉమ్మడి మెదక్‌లో డబ్బు...మద్యం..సాఫ్ట్‌డ్రింక్స్
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ లీడర్లు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. వివిధ గ్రామాల్లో బూత్‌ల వారీగా పంపిణీ చేసేందుకు 27 పార్సిళ్లలో 88.43 లక్షలు తరలిస్తుండగా శనివారం అర్ధరాత్రి పోతిన్ పల్లి చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు. చేగుంటకు చెందిన అన్నం రవి, పుల్లబోయిన రవి అనే ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లను అదుపులోకి తీసుకొని రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డబ్బు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి చెందినదిగా అనుమానిస్తున్నారు. ఇదే జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో అక్రమంగా దాచిన 74 మద్యం బాటిళ్లను ఆదివారం నిజాంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో ఓ పార్టీ లీడర్లు ఆదివారం ఓటర్లకు రూ.500, ఒక క్వార్టర్ బాటిల్, లేడీస్‌కు కూల్డ్రింక్బాటిల్ చొప్పున పంపిణీ చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. తొగుట మండలం కానుగల్ వద్ద ఒక ఇంట్లో పంచేందుకు సిద్ధంగా ఉన్న 50 కేసుల కూల్ డ్రింక్స్ ను పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్ లో బీఆర్ఎస్ లీడర్ ఇంట్లో డబ్బు, మద్యం ఉన్నాయన్న సమాచారంతో ఇల్లు సీజ్ చేశారు. కాకతీయనగర్ లో పంచేందుకు సిద్ధంగా ఉన్న రూ.2 లక్షల అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేటలోని కంచర్ బజార్ లో ఓ ఇంట్లో పంపిణీకి సిద్ధం చేసిన ఐదు కాటన్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే జిల్లా తొగుట మండలం తిమ్మాయపల్లి వద్ద డబ్బులు పంచడానికి బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారనే సమాచారంతో కాంగ్రెస్ నాయకులు చేరుకోగా, ఇరువర్గాల నడుమ వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఓటుకు రూ.500, క్వార్టర్ బాటిల్ పంపిణీ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.