సిద్దిపేట మున్సిపల్ ​చైర్మన్​కు అవిశ్వాస గండం

  •     నోటీసుకు విపక్ష కౌన్సిలర్ల సన్నాహాలు
  •     పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు
  •     నేడో రేపో కలెక్టర్ కు నోటీసు అందజేత

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్​కన్ను పడింది. చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ సభ్యుల మద్దతుతో అవిశ్వాస నోటీసుఅందజేయడానికి సిద్దమవుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరగా వారిలో ఒకరు అవిశ్వాస నోటీసు ఇవ్వడానికి బాధ్యతలు తీసుకుని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ, ఎంఐఎం నుంచి ఒక్కో కౌన్సిలర్​అవిశ్వాస నోటీసుపై సంతకాలు పెట్టడానికి సిద్దంగాఉన్నారు.

వీరికి మరో 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దుతు ఇవ్వడానికి ఓకే అన్నట్లు సమాచారం. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 స్థానాలకు గాను 2021 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 36, బీజేపీ,ఎంఐఎం ఒక్కో సీటు గెలుచుకోగా ఐదుగురు ఇండిపెండెంట్లుగా గెలిచారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థులు తర్వాత బీఆర్ఎస్ లో చేరడంతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం 41 కి చేరింది. 

నేడో రేపో అవిశ్వాస నోటీసు అందజేత

సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ పై  ఒకటి రెండు రోజుల్లో అవిశ్వాస నోటీసును కలెక్టర్ కు అందజేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల కింద అవిశ్వాస నోటీసుపై  సంతకాలు చేసే కౌన్సిలర్లు రహస్యంగా సమావేశమై చర్చించుకున్నట్టు సమాచారం. చైర్ పర్సన్ భర్త పెత్తనంపై అసంతృప్తితో ఉన్న కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు పై సంతకాలు పెట్టడానికి రెడీ అయ్యారు. కలెక్టర్ కు అవిశ్వాస నోటీసు అందజేసి క్యాంపునకు వెళ్లడానికి కౌన్సిలర్లు నిర్ణయించుకున్నట్టు సమాచారం. మొదట బీఆర్ఎస్  చైర్ పర్సన్

వైస్ చైర్మన్లను గద్దె దింపడమే లక్ష్యంగా విపక్ష పార్టీల కౌన్సిలర్లు పావులు కదుపుతుండగా ఇందుకు ఆయా పార్టీల హైకమాండ్​లు సైతం మద్దతు ఇస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 25 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుండడంతో ఇప్పటి నుంచే  ప్రత్యేక ప్రణాళికు రూపకల్పన చేస్తున్నారు. 

కంచుకోటలో పాగా వేయాలని..

రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్ కు కంచుకోటగా మారిన సిద్దిపేట మున్సిపాలిటీలో పాగా వేయడానికి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ​అధికారం చేజారడంతో పాటు పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇదే సమయంలో బల్దియాపై జెండా ఎగరవేయాలని కాంగ్రెస్​భావిస్తోంది. ఇందుకు అసంతృప్తితో ఉన్న కొందరు బీఆర్​ఎస్​కౌన్సిలర్లు సైతం మద్దతు ఇస్తున్నారు.