ధరణి ప్రక్షాళన మొదలైంది.. లక్షా 79 వేల దరఖాస్తులకు పరిష్కారం

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తెచ్చి రాష్ట్రంలో అరాచకం సృష్టించిందన్నారు. ధరణి నిజమైన భూ యజమానులకు సొంత భూమిని దూరం చేసిందన్నారు. ధరణి వల్ల లక్షలాది మంది రైతులు అన్యాయానికి గురయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.  చదువు, పెళ్లి కోసం భూమి అమ్ముకోలేని దుస్థితి తెచ్చారన్నారు. ధరణి పోర్టల్ లోపాలను హైకోర్టు కూడా ఎత్తి చూపిందని గుర్తు చేశారు. 

జనవరి 2024లో ధరణిలోని లోపాల అధ్యయనం కోసం కమిటీ వేసిందని.. ధరణి సమస్యలు పరిష్కరించటానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా మార్చి 1 నాటికి 2 లక్షల 26 వేల 740 దరఖాస్తులు పెండింగ్ ఉండగా  గడిచిన నెలలో మళ్లీ కొత్తగా లక్షా 22 వేల 774 కొత్త దరఖాస్తులు వచ్చాయన్నారు.  మొత్తంగా 3 లక్షల 49 వేల 500 దరఖాస్తుల్లో మార్చి 1 నుంచి నేటి వరకు లక్షా 79 వేల 143 దరఖాస్తులను పరిష్కరించామన్నారు.  నేటికీ ధరణిలో 35 లావాదేవీలకు సంబంధించి. .10 సమాచార మాడ్యుల్స్ తీసుకురావటం జరిగిందన్నారు. వీటితో రైతులకు కొంత ఉపశమనం దొరికిందన్నారు. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని భట్టి తెలిపారు.