మల్లన్న క్షేత్రానికి శ్రావణ శోభ .. ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న క్షేత్రం శ్రావణ శోభను సంతరించుకుంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పోటెత్తారు.  దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయత్రం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం నిద్రలేచి స్నానమాచరించి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దర్శనానికి గంటల సమయం పట్టింది. అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోడెల స్తంభం వద్ద స్వామి వారికి కోడెలను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు.

గర్భగుడిలో ఫొటోలు తీయడం నిషేధం

గర్భగుడిలో స్వామివారి అమ్మవార్ల మూలవిరాట్ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచురించడం వల్ల ఆలయ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని ఈఓ బాలాజీ తెలిపారు. ఆగస్ట్​12 నుంచి ఫొటోలు తీయడం నిషేధమని, పత్రికా విలేకరులు, ప్రజలు సహకరించాలని కోరారు. 

పాపన్నపేట: ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ పరిసర ప్రాంతాలు దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. ఏపీ, కర్నాటక, మహరాష్ట్రతో  పాటు తెలంగాణలోని వివిధ  ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మంజీర పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. దుర్గమ్మకు ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.