గంజాయి మత్తులో మల్లన్న భక్తులపై దాడి

  •     కొమురవెల్లి పీఎస్​కు కూతవేటు దూరంలో ఘటన

కొమురవెల్లి, వెలుగు : కొంతమంది యువకులు గంజాయి మత్తులో జాతరకు వచ్చిన భక్తులపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చిన ఘటన శనివారం అర్థరాత్రి కొమురవెల్లి టెంపుల్  రాజగోపురం సమీపంలో జరిగింది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియా టీ 20 వరల్డ్​ కప్  గెలిచిన సందర్భంగా పలువురు సంబురాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో హైదరాబాద్ కు చెందిన కరుణాకర్, సాయి వెంకట్, జశ్విన్  మల్లన్నను దర్శించుకొని గుడి ముందు నుంచి

వెళ్తున్న క్రమంలో అక్కడే ఉన్న గ్రామ యువకులతో గొడవ జరిగింది. అక్కడే ఉన్న కొమురవెల్లికి చెందిన ఎస్  నవీన్, డి నవీన్, డి వినయ్, శివమణి, పవన్, ఆర్  రాజు, కొమురవెల్లి పోలీస్​స్టేషన్ లో ప్రైవేట్  డ్రైవర్ గా డ్యూటీ చేస్తున్న శ్రీకాంత్  ముగ్గురు భక్తులపై దాడి చేశారు. తలపై రాడ్​తో కొట్టడంతో ఓ భక్తుడి తలకు తీవ్ర గాయమైంది. గొడవ ఆపడానికి వెళ్లిన కొమురవెల్లికి చెందిన గణేశ్​పై కూడా దాడి చేయడంతో అతడి చేయి విరిగింది.

విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఘటనా స్థలానికి చేరుకొని కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది పరారయ్యారు. ఇదిలాఉంటే భక్తులను గాయపర్చిన యువకులు గంజాయి మత్తులో ఉన్నారని, వారి వద్ద గంజాయి దొరికిందని స్థానికులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.