అవి పూర్తిచేయరు.. ఇవి ప్రారంభించరు

  • ప్రజాధనం వృథా, స్పందించని అధికారులు

మెదక్, వెలుగు : మెదక్ పట్టణంలో ప్రజల సౌకర్యం కోసం కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పూర్తయినా ప్రారంభించడం లేదు. చేపట్టిన పలు పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. దాదాపు రూ.35 కోట్ల విలువైన పనుల పరిస్థితి ఇది. పట్టణ శివారులోని పిట్లం చెరువు- గో సముద్రం చెరువులను కలిపి మినీ ట్యాంక్​ బండ్​గా తీర్చిదిద్దేందుకు రూ.9.52 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్​ బండ్​ పనులు దాదాపు తొమ్మిదేళ్లయినా అసంపూర్తిగానే ఉండటం గమనార్హం. గతేడాది సెప్టెంబర్​లో మరో రూ.8 కోట్లు మంజూరు కాగా కొంత మేర పనులు చేపట్టి వదిలేశారు.

రూ.4.50 కోట్లతో ఇరిగేషన్​ ఆఫీస్​ వద్ద చేపట్టిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ నిర్మాణం పిల్లర్ల స్థాయిలోనే నిలిచి పోయింది. పనులు జరక్కపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెట్లపొదలు మొలిచి అధ్వాన్నంగా తయారైంది. పట్టణ నడిబొడ్డున రాందాస్​ చౌరస్తాలో రూ.3 కోట్లతో చేపట్టిన మున్సిపల్ షాపింగ్​కాంప్లెక్స్​ నిర్మాణం ఏండ్లుగా సాగుతూనే ఉంది. ఇప్పటికీ కాంప్లెక్స్​ పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి. న్యూమార్కెట్​ఏరియాలో దాదాపు ఐదేండ్ల కింద రూ.6.11 కోట్లతో చేపట్టిన రైతు బజార్​ నిర్మాణం దాదాపు పూర్తయినా దానిని ప్రారంభించి వినియోగంలోకి తేవడం లేదు.

అలాగే అంబేద్కర్​ చౌరస్తా నుంచి చెమన్​కు వెళ్లే దారిలో ఫారెస్ట్​ ఆఫీస్​వద్ద రోడ్డు పక్కన నిర్మించిన షాపింగ్​ షెడ్​ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. ఇలా కోట్ల విలువైన పనులు పూర్తయి అందుబాటులోకి రాకున్నా, అసంపూర్తిగా ఉన్నా సంబంధిత అధికారలు పట్టించుకోవడం లేదు. అటు ప్రజాప్రతినిధులు స్పందంచడం లేదు. దీంతో ప్రజా ధనం వృధా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.