- మూడు రోజులు టైమ్ ఇవ్వాలని, స్వచ్ఛందంగా తొలగిస్తామన్న కాలనీవాసులు
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ఏరియా డిష్ లైన్లో డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ ఆఫీసర్లు కూల్చివేశారు. సోమవారం మున్సిపల్కమిషనర్వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆఫీసర్లు, సిబ్బంది జేసీపీ, ట్రాక్టర్లతో అక్రమ నిర్మాణాలను తొలగించే పనులు చేపట్టారు. భగత్‌సింగ్‌నగర్ డిష్లైన్లో సుమారు 200 మీటర్ల మేర అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు.
డిష్ లైన్‌లోని డ్రైనేజీపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వానాకాలంలో వరదతోపాటు, వ్యర్థాలు బయటకు వెళ్లకుండా దిగువ ప్రాంతాలైన భగత్‌సింగ్‌నగర్, శ్రీపతినగర్లోని ఇండ్లలోకి వస్తున్నాయని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రెండు వారాల క్రితం ఆ ప్రాంతానికి చెందిన యువజన కాంగ్రెస్ లీడర్ రాయబారపు కిరణ్, స్థానికులు కలిసి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ సిబ్బంది డ్రైయినేజీలపై ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు పనులు చేపట్టారు.
టైమ్ ఇవ్వండి
డ్రైనేజీలపై నిర్మించిన నిర్మాణాలను మూడు రోజుల్లో స్వచ్చందంగా తొలగిస్తామని, అప్పటి వరకు తమకు టైమ్ ఇవ్వాలంటూ కాలనీవా సులు, వ్యాపారులు మున్సిపల్ఆఫీసర్లను కోరారు. దీంతో మున్సిపల్ సిబ్బంది తొలగింపు పనులు నిలిపివేశారు. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న అక్రమ నిర్మాణాలపై చర్యలకు మున్సి పల్ ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. మందమర్రి ఊర చెరువులో ఎఫ్టీఎల్ గుర్తింపు, సరిహద్దుపై ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లు జాయింట్సర్వే చేసేందుకు సిద్దమవుతున్నారు.