ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జలగం అనిత ట్రాన్స్‌ఫర్‌ను నిలిపివేయాలంటూ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. బుధవారం కాలేజీ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. కాలేజీ అభివృద్ధితో పాటు స్టూడెంట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ప్రిన్సిపాల్‌ను ట్రాన్స్‌ఫర్ చేయొద్దని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్‌ఫర్‌ను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ధర్నా విరమించారు.
లక్సెట్టిపేటలో రాస్తారోకో...
లక్సెట్టిపేట, వెలుగు : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జై కిషన్ ఓజాను ట్రాన్స్‌ఫర్ చేయొద్దంటూ బుధవారం స్టూడెంట్లు ఊట్కూర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ కిషన్ ఓజా డిగ్రీ కాలేజీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, కొత్త కోర్సులు ప్రారంభానికి చర్యలు తీసుకున్నారన్నారు.
ఆయన ట్రాన్స్‌ఫర్‌ను రద్దు చేసి లక్సెట్టిపేటలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై తానాజీ నాయక్ సిబ్బందితో వచ్చి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని స్టూడెంట్లకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం స్టూడెంట్లు తహసీల్దార్ ఆఫీస్‌కు చేరుకొని వినతిపత్రం అందజేశారు.