2025 మార్చి నాటికి అప్పులు .. 7.33 లక్షల కోట్లు

  • ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్ బీఎం పరిధిలో 62 వేల కోట్లు 
  • తీసుకోవాలని సర్కార్ నిర్ణయం
  • ఎడాపెడా అప్పులు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
  • వాటి చెల్లింపులకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి
  • బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులే 6.70 లక్షల కోట్లు
  • కార్పొరేషన్ల పేరుతో ఇష్టానుసారంగాలోన్లు తెచ్చిన గత సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అప్పులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.7.33 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే రూ.6.70 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.62 వేల కోట్ల మేర అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించింది. ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్​బీఎం పరిధిలోనే తీసుకోవాలని నిర్ణయించింది.

 దీంతో ఎఫ్ఆర్​బీఎం పరిధిలో ఉన్న అప్పుల మొత్తం రూ.4.50 లక్షల కోట్లకు చేరనుంది. ఇది జీఎస్​డీపీలో 27.4 శాతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యారంటీ కింద వివిధ కార్పొరేషన్లు, ఇనిస్టిట్యూషన్ల(స్పెషల్​ పర్పస్​ వెహికల్) పేరుతో రూ.2 లక్షల 22 వేల 670 కోట్లు, నాన్​ గ్యారంటీ కింద రూ.59 వేల 414 కోట్లు అప్పు చేసింది. ఇందులో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కింద రూ.74,590 కోట్లు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కింద రూ.20,200 కోట్లు, తెలంగాణ వాటర్ రీసోర్సెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద రూ.14,060 కోట్లు, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కింద రూ.6,470 కోట్లు, తెలంగాణ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద రూ.2,951 కోట్లు తీసుకున్నది. 

వీటన్నింటి కిస్తీలు, వడ్డీలకు కలిపి యావరేజ్​గా నెలకు రూ.5,365 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.605 కోట్లతో మొదలైన ఈ కిస్తీలు, వడ్డీల చెల్లింపుల భారం.. 2023–24 నాటికి రూ.53,978 కోట్లు చేరింది. ఇందులో బడ్జెట్ తో పాటు బయటి నుంచి చేసిన చెల్లింపులు కూడా ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో 34 శాతం అప్పుల చెల్లింపులకే పోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా... గత ప్రభుత్వం చేసిన అప్పుల కిందనే రూ.42,892 కోట్లు చెల్లించింది.