న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి కిందటి నెలలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆన్ ఇండియా (యాంఫి) డేటా ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్‌లో డెట్ ఫండ్ స్కీమ్‌లలోకి నికరంగా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 16 లోని 14 డెట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలు నెట్ ఇన్‌ఫ్లోస్ చూశాయి. మరోవైపు మీడియం మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న, రిస్క్ ఎక్కువగా ఉన్న ఫండ్స్ నుంచి మాత్రం పెట్టుబడులను ఇన్వెస్టర్లు విత్‌డ్రా చేసుకున్నారు.
డెట్ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్ చివరి నాటికి రూ.16.64 లక్షల కోట్ల అసెట్స్‌ను మేనేజ్ చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రికార్డ్ అయిన రూ.14.97 లక్షల కోట్ల నుంచి 11 శాతం పెరిగాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.1.14 లక్షల కోట్లు వెళ్లిపోయాయి. కిందటి నెలలో డెట్ ఫండ్స్ పొందిన నెట్ ఇన్‌ఫ్లోస్‌లో రూ.83,863 కోట్లు లిక్విడ్ ఫండ్స్‌లోకి వచ్చాయి.
ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ.25,784 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ. 25,303 కోట్లు వచ్చాయి. సెప్టెంబర్‌లో ట్యాక్స్ సెటిల్‌మెంట్స్ పూర్తి చేసుకొని అదనపు ఫండ్స్‌ను లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి కార్పొరేట్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాయని ఎనలిస్టులు పేర్కొన్నారు.