డీడీ పైసలు వాపస్.. గొర్రెల స్కీమ్​లో భారీ ఎత్తున అవినీతి

  •     స్కీమ్​ అమలు నిలిపివేసిన ప్రభుత్వం
  •     రెండో విడత లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్న​అధికారులు

మెదక్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సబ్సిడీ  గొర్రెల స్కీమ్ లో భారీ ఎత్తున అవినీతి జరగడంతో ఆ స్కీమ్ అమలును ప్రస్తుత​ ప్రభుత్వం నిలిపి వేసింది. ఈ నేపథ్యంలో రెండో విడతలో గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారుల వాటా మొత్తం చెల్లించిన వారికి ఆ మొత్తాన్ని వాపస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వారికి వెటర్నరీ డిపార్ట్​మెంట్​అధికారులు వారు చెల్లించిన డీడీ అమౌంట్​మొత్తాన్ని వారి బ్యాంక్​ అకౌంట్లలో జమచేస్తున్నారు. కుల వృత్తులపై ఆధార పడి జీవించే వారికి  మెరుగైన జీవనోపాధి కల్పించే ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకుర్మల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. 

మెదక్​ జిల్లాలో 341 సంఘాలు ఉండగా, వాటిల్లో 20,182 మంది సభ్యులుగా ఉన్నారు. మొదటి విడతలో జిల్లాలో 13,766 గొర్రెల యూనిట్లు  మంజూరయ్యాయి. రెండో విడతలో 2,584 మంది లబ్ధిదారు వాటాగా  ఒక్కొక్కరూ రూ.43,750 చొప్పున డీడీ రూపంలో చెల్లించారు. వారిలో కేవలం 642  మంది లబ్ధిదారులకు మాత్రమే 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయి. మిగితా 1,942 మంది డీడీలు కట్టి ఏడాది గడచినా గొర్రెల యూనిట్లు మంజూరు కాలేదు. లబ్ధిదారు వాటా చెల్లించి దరఖాస్తు చేసిన గొల్లకుర్మలు నెలల పాటు వెటర్నరీ ఆఫీస్​ల చుట్టూ తిరిగినా, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం దొరకలేదు. 

అప్పులు చేసి, బంగారం కుదువపెట్టి లబ్ధిదారు వాటా పైసలు చెల్లించామని, ఏడాది అయిపోయినా గొర్రెలు రాకపోగా, తెచ్చిన అప్పులకు మిత్తి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  డీడీలు కట్టిన వారికి వెంటనే  గొర్రెలు ఇప్పించాలని లేదా.. తాము వాటా కింద చెల్లించిన పైసలు వాపస్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ రావడంతో గొర్రెల స్కీమ్ అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గొర్రెల స్కీమ్ లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది.  పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు తేలడంతో  గొర్రెల స్కీం అమలును  ప్రభుత్వం నిలిపివేసింది.  ఈ నేపథ్యంలో  గత ప్రభుత్వ హయాంలో గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టిన వారికి వారు చెల్లించిన పైసలు వాపస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

399 మందికి చెల్లింపు..

జిల్లాలో రెండో విడతలో డీడీలు కట్టి గొర్రెల యూనిట్లు మంజూరు కానివారు తాము చెల్లించిన పైసలు వాపస్​ ఇవ్వాలంటూ వెటర్నరీ ఆఫీస్​లో దరఖాస్తులు ఇస్తున్నారు. అధికారులు ఎంక్వైరీ చేసి సంబంధిత లబ్ధిదారుల అకౌంట్లలో జమచేస్తున్నారు. ఇప్పటి వరకు 399 మందికి వారు చెల్లించిన మొత్తాన్ని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. మరో 306 మంది తమ పైసలు వాపస్ ఇవ్వాలని దరఖాస్తు చేయగా అవి అధికారుల పరిశీలనలో ఉన్నాయి.  వాటితో పాటు ఈ నెలాఖరులోగా అందరికీ డీడీ అమౌంట్ చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా వెటర్నరీ అధికారి విజయ శేఖర్​రెడ్డి తెలిపారు.