రానున్నది బీసీల రాజ్యమే: దాసు సురేశ్

నస్పూర్, వెలుగు: రానున్నది బీసీల రాజ్యమేనని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్​లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ఫలితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీరని నష్టం జరుగుతోందని ఆరోపించారు. 

75 ఏండ్లు గడిచిన చట్టసభల్లో రిజర్వేషన్లకు నోచుకోని బీసీలు తిరుగుబాటు లేకనే రాజకీయంగా అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్​లో బీసీ వర్గాలు లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. అగ్రవర్ణాల ప్రజలు వారి వాటాను వారు అనుభవించుకుంటూనే బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటారు కూడా అనుభవిస్తున్నారని మండిపడ్డారు. బీసీలంతా ఏకమవ్వాలని, సంఘటితమైతే రానున్నది బీసీల రాజ్యమేనన్నారు. మంచిర్యాల జిల్లా ఇన్​చార్జ్​గా పిట్టెం లక్ష్మణ్, కన్వీనర్​గా వడ్డేపల్లి మనోహర్​ను నియమించారు. 

కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి మహిళా ఉపాధ్యక్షురాలు ఏరుగొండ పద్మావతి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి, ప్రధాన కార్యదర్శి గోషిక స్వప్న, పారసాని దుర్గేశ్ ప్రసన్న, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగోని స్వరూప, బుర్రా కుమార్ గౌడ్, జూలూరి రమేశ్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి ముంజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.