దండేపల్లి వాసికి కార్పొరేషన్ చైర్మన్ పదవి

  • రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్​గా కోత్నాక తిరుపతి
  • ఉపాధి హామీ కూలి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ

దండేపల్లి, వెలుగు : ఉపాధి హామీ కూలీగా పనిచేసిన సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఓ యువకుడు నేడు రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్​గా ఎదిగాడు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు కోత్నాక తిరుపతికి గిరిజన కార్పొరేషన్ ​చైర్మన్ పదవి వరించింది. కొద్దికాలం ఉపాధి హామీ కూలీగా పనిచేసిన తిరుపతి.. ఆ తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అనుచరుడిగా గుర్తింపు పొంది జిల్లా ఆదివాసీ యువసేన అధ్యక్షుడిగా, జాతీయ కాంగ్రెస్ ఆదివాసీ కోఆర్డినేటర్​గా పనిచేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రలో 6 నెలలపాటు పాల్గొని ఆయన దృష్టిని ఆకర్షించారు. దండేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తిరుపతి.. మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్ లోని ప్రభుత్వ వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి ఆదివాసీ సంఘాల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని గిరిజనుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేశారు.

2022లో దండేపల్లి మండలం కోయపొచు గూడ ఆదివాసీ గిరిజనుల అటవీ భూ పోరాటాన్ని రాష్ట్రస్థాయికి తీసుకుపోవడంలో కృషిచేశారు. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్న తిరుపతిని పలువురు అభినందించారు.