- పెద్ద శంకరంపేట కాంగ్రెస్ జనజాతర సభ సక్సెస్
నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, వెలుగు: బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధి పెద్దశంకరంపేటలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల వల్లే తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వచ్చిందన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఉందని, పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు దోచుకుందని ఆరోపించారు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని జహీరాబాద్కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు మాత్రమే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోఅభివృద్ధి పనులు జరిగాయన్నారు.
పదేళ్లుగా ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఏ ఒక్క అభివృద్ధి పని చేయకుండా, ఎవరికి అందుబాటులో ఉండకుండా అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రస్తుతం మళ్లీ అతను పార్టీ మార్చి బీజేపీ పేరుతో వస్తున్నాడన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుమాట్లాడుతూ బీబీపాటిల్ కు బై బై చెప్పాలన్నారు. పదేళ్లు ఎంపీగా ఉండి బీబీ పాటిల్ జహీరాబాద్ సెగ్మెంట్ కు చేసిందేమీలేదని, ప్రస్తుతం బీఆర్ఎస్ ద్వారా గెలవలేనని బీజేపీలోకి వెళ్లాడని ఎద్దేవా చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఐదు గ్యారంటీలను అమలు చేశామని, అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నత విద్య అవకాశాలు మెరుగుపరిచి ఉపాధి కల్పించే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ వెనుకబడిన ప్రాంతమని అభివృద్ధి విషయంలో సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి పెట్టే ఖర్చులో 25 శాతం నారాయణఖేడ్ నియోజకవర్గంపై పెట్టాలని ఆయన కోరారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి రాష్ట్రస్థాయి ఇంటర్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన ప్రభుత్వ జూనియర్ కాలేజ్అభివృద్ధికి రూ. 2 కోట్లు, ఒక మహిళ ఐటీఐ కాలేజీతో పాటు ఉన్నత విద్య అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. రెండు వేల ఎకరాలు సేకరించి ఇస్తే 30 రోజుల్లో ఫార్మా విలేజ్, క్లస్టర్ ఏర్పాటు చేసి కావేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే మహిళల కోసం ఐటీఐ, లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.