దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బులు ఆశ చూపించి అమాయకులు దాచుకున్న సొమ్మును క్షణాల్లో లూటీ చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ బాబులు బాగా రెచ్చిపోతున్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు టోకరా వేశారు. ఏకంగా ఆమె నుంచి రూ. 13లక్షలు కొట్టేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పటాన్‌చెరులో ఉండే ఓ మహిళకు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు ఉంటాయంటూ నమ్మబలికారు సైబర్ నేరగాళ్లు. దీంతో వారి మాటలు నమ్మిన మహిళ పలు దఫాలుగా రూ.13.82 లక్షలు పెట్టుబడులు పెట్టింది. అయితే తనకు వచ్చిన లాభాలు పంపించాలని మహిళ వారికి మెసేజ్ చేయగా సైబర్ నేరగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.