మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించడానికి తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు కోనేరులో స్నానాలు చేసి మల్లికార్జున స్వామికి నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య ఉరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. అనంతరం గంగరేగు చెట్టు దగ్గర  పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరి కొంతమంది భక్తులు స్వామికి అభిషేకాలు చేసి, ఒడిబియ్యం పోసి కోడెలు కట్టి మొక్కులు చెల్లించారు.  దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది.