మంచిర్యాల, వెలుగు: ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో మంచిర్యాల జిల్లాలో 4,636 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కోటపల్లి మండలంలోని 18 గ్రామాల్లో 864 ఎకరాలు, భీమిని మండలంలోని ఏడు గ్రామాలలో 112 ఎకరాలు, వేమనపల్లి మండలంలోని 15 గ్రామాల్లో 2,155 ఎకరాలు మునిగాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు పంపినట్టు డీఏవో కల్పన తెలిపారు. వరదలు తగ్గిన తర్వాత వాస్తవ పంటనష్టం అంచనా వేస్తామన్నారు. మంగళవారం సాయంత్రానికి ప్రాణహితకు వరద తగ్గుముఖం పట్టింది.
-
ఎకరానికి రూ.20వేల పరిహారం ఇవ్వాలి : బీజేపీ
ప్రాణహిత వరదలతో పంటలు నీటమునిగి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల పరిహారం చెల్లించాలని- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కోటపల్లి మండలంలోని సిర్సా గ్రామంలో నీటమునిగిన పంటలను నాటుపడవపై వెళ్లి పరిశీలించారు. నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్, దుర్గం అశోక్, మంత్రి రామన్న, పట్టి వెంకటకృష్ణ పాల్గొన్నారు.
-
మూడు రోజులుగా ముంపులోనే
బెల్లంపల్లిరూరల్: మూడు రోజులుగా ప్రాణహిత నది ముంపు వరదలోనే 2500 ఎకరాల పత్తి చేళ్లు ఉనిగి ఉన్నాయి. కళ్లంపల్లి, ముక్కిడిగూడం, జాజులపేట, సుంపుటం, వేమనపల్లి, కల్మలపేట, రాచర్ల, కేతన్‌పల్లి, ముల్కలపేట శివారులలో వరద పోటెత్తి ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం కొంచం తగ్గి మళ్లీ ఉద్ధృతమైంది.
ముల్కలపేట-రాచర్ల గ్రామాల మధ్య రహదారితో పాటు సుంపుటం, అట్టలొర్రే, అంకన్నపేట ఒర్రే, ముక్కిడిగూడం , ముత్యాలమ్మగుడి వద్దకు వరద పోటెత్తింది. పుష్కరఘాట్‌తో పాటు ఎంచపాయకు రాకపోకలు నిలిచిపోయాయి. దిగువన గోదావరి నదిలో సైతం వరద పెరుగుతుండటం ఎగువన పెనుగంగా, వార్దా నదుల నుంచి వరద పోటెత్తడంతో భారీ నష్టం కలుగుతోంది.