చార్​సౌ బీస్​ పనులు చేస్తే చార్​ సౌ పాంచ్​ సీట్లిస్తరా? : చాడ వెంకట్​రెడ్డి

  •     మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పిన్రు 
  •     కేసీఆర్​, జగన్​కూ అదే గతి పట్టింది
  •     రేవంత్​ వైఎస్​ లెక్క పరిపాలించాలె
  •     సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి

హుస్నాబాద్​, వెలుగు : ‘మోదీ పదేండ్ల పాలన ​విచ్చలవిడిగా, ఏకపక్షంగా, నియంతృత్వంగా, కార్పొరేట్​శక్తులకు అనుకూలంగా సాగింది. రైతులు, కార్మికులు, శ్రమజీవులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నడు. చార్​సౌ పాంచ్​ సీట్లు కావాలని ఎన్నికల్లో ప్రజల ముందుకొచ్చిండు. చార్ ​సౌ బీస్ ​పనులు చేసిన ఆయనకు సీట్లు తగ్గించి ప్రజలు తగిన బుద్ధి చెప్పిన్రు. అహంకారం, నియంతృత్వ పోకడలతో వ్యవహరించిన కేసీఆర్​, జగన్​కు కూడా అదే గతి పట్టింది. రేవంత్​రెడ్డి పరిపాలన వాళ్లకు భిన్నంగా..వైఎస్​ రాజశేఖరరెడ్డి తరహాలో సాగాలి’  అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి అన్నారు.  

గురువారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టిన మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ, జేడీయూ, ఇతర చిన్నచిన్న పార్టీల మద్దతుతో ఆయన పరిపాలన చేయాల్సి వస్తోందని, అవే పార్టీలు ఇండియాకూటమికి మద్దతిస్తే కాంగ్రెస్​ సారథ్యంలో సర్కారు ఏర్పాటవుతుందన్నారు. వామపక్షాలు కూడా బలహీనపడుతున్నాయని, దీనిపై అంతర్మథనం జరుపుతామన్నారు. 


రాష్ట్రంలో రేవంత్​రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగా ప్రజాదర్భార్​ నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ గంటపాటు ప్రజలను కలవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు, మేధావులు ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తున్నారన్నారు. కేసీఆర్​ చేసిన అవినీతి, మేడిగడ్డ, విద్యుత్​ కొనుగోళ్లు , ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారాలన్నిటినీ చట్టం చూసుకుంటుందని, ఆయనపై కక్ష సాధింపుకు దిగకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంపై దృష్టి పెట్టాలన్నారు. పదేండ్లుగా పక్కా ఇండ్లకు నోచుకోని పేదలకు ఇండ్లు కట్టించాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పవన్​, రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు వనేశ్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.