కౌంటింగ్​కు కౌంట్ డౌన్​ షురూ

  •     మెదక్ లోక్​ సభ ఓట్ల లెక్కింపు నర్సపూర్​లో
  •     7 హాళ్లు, 103 టేబుల్స్ ఏర్పాటు

మెదక్​, వెలుగు: మే13న జరిగిన లోక్​సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్​కు కౌంట్​డౌన్​ షురూ అయింది. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఈ నెల 4న ఓట్ల  లెక్కింపు జరుగుతుంది. మెదక్ లోక్ సభ నియోజకవర్గ  ఓట్ల లెక్కింపు మెదక్ జిల్లా నర్సాపూర్​లో జరుగనుంది. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం7 అసెంబ్లీ సెగ్మెంట్లు​ ఉండగా  రెండు చోట్ల ఓట్ల లెక్కింపు జరుగనుంది. నర్సాపూర్  బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో మెదక్, నర్సాపూర్​, సిద్దిపేట, గజ్వేల్​, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ లో సంగారెడ్డి, పటాన్​చెరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు జరుగనుంది. 

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​ ఓట్ల లెక్కింపుకోసం ఒక హాల్​ చొప్పున 7 హాల్​లు ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించేందుకుగాను అన్నిచోట్ల కలిపి మొత్తం 103 టేబుల్స్​అరేంజ్​చేశారు. కౌంటింగ్​ హాల్ లలో మొత్తం 199 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్​ ప్రక్రియను అబ్జర్వర్లు పర్యవేక్షించనున్నారు. 
 

147 రౌండ్స్​..
 

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దుబ్బాక 19, మెదక్​ 20, సిద్దిపేట 20, గజ్వేల్​ 22, నర్సాపూర్​ 22, సంగారెడ్డి 21, పటాన్​ చెర్​ 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మొత్తం లోక్​సభ నియోజకవర్గ పరిధి ఓట్ల లెక్కింపు 147 రౌండ్లలో పూర్తి కానుంది.  
 

పోస్టల్​బ్యాలెట్ ​కోసం 18 టేబుల్స్​
 

పోస్టల్ బ్యాలెట్ ద్వారా 14,297 ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా ఒక హాల్, అందులో 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్​బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లలో జరుగనుంది. 
 

666 మంది సిబ్బంది
 

లోక్​సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 564 మంది సిబ్బందిని, పోస్టల్​ బ్యాలెట్​ఓట్ల లెక్కింపుకోసం 102 మంది సిబ్బందిని నియమించారు. వారికి మొదటి విడత శిక్షణ పూర్తికాగా, ఈనెల 3న రెండో విడత శిక్షణ ఇవ్వనున్నారు.