హైదరాబాద్ సిటీ, వెలుగు: నాణ్యతలేని పత్తి విత్తనాలను అమ్మి రైతును మోసగించినందు కు రూ.60 వేలు, 7 శాతం వడ్డీ చెల్లించాలని ఓ సీడ్ కంపెనీకి స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్ జరిమానా విధించింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగుకు చెందిన రైతు రవీందర్ రెడ్డి.. అదే గ్రామంలోని ఓ ఫర్టిలైజర్స్ షాపులో బీటీ పత్తి విత్తనాలను రూ.850కి ఒక ప్యాకెట్ చొప్పున 5 ప్యాకెట్లు కొని, తన పొలంలో నాట్లు వేశాడు. మొలక దశలోనే పురుగు పట్టి పంట నాశనమైంది. మొత్తం పంట పెట్టుబడి ఎకరానికి రూ.40 వేలు ఖర్చయ్యా యని, తనకు పరిహారం చెల్లించాలని షాపు నిర్వాహకుడిని రైతు కోరాడు.
అతడు స్పం దించకపోవడంతో విత్తనాలు సరఫరా చేసిన హైదరాబాద్‌కు చెందిన బేయర్ కంపెనీని బాధితుడు సంప్రదించాడు. అక్కడ కూడా పట్టించుకోకకపోవడంతో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించగా, పంట నష్టాన్ని అంచనా వేస్తూ రూ. లక్షా 8 వేలు, విత్తనాలు కొన్న తేదీ నుంచి 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. డిస్ట్రిక్ట్ ఫోరమ్ తీర్పును సవాలు చేస్తూ విత్తనాల కంపెనీ.. స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్‌లో రివర్స్ అప్పీలు దాఖలు చేసింది. స్టేట్ కన్జ్యూమర్ ఫోరమ్ పంట నష్టాన్ని, రైతు పడ్డ మానసిక ఆవేదనకు కలిపి మూడెకరాలకు రూ.60 వేలు, 7 శాతం వడ్డీతో సహా చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.