పత్తి చుట్టూ రాజకీయం.. ఆదిలాబాద్​లో పాయల్ వర్సెస్ జోగు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పత్తికి ధర లేక రైతులు దగాపడుతుంటే.. మారోపక్క నేతలు పత్తి చుట్టూ రాజకీయం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఆదిలాబాద్ మార్కెట్ గుజరాత్ నామస్మరణతో మార్మోగుతోంది. గుజరాత్ లో రూ.8,800 చెల్లిస్తున్నారని, ఆదిలాబాద్ లో కూడా అదే ధర చెల్లించాలని రైతులతో పాటు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పత్తి ధర విషయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న సవాళ్లకు దిగారు. 

కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రామన్న ఫైర్

ఆదిలాబాద్ పత్తి రైతులు ధర కోసం లో ప్రతి ఏటా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది సైతం అదే జరిగినప్పటికీ గతంలో లేనివిధంగా అది కాస్తా రెండు పార్టీల మధ్య చిచ్చురేపింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సీసీఐ ద్వారా కమర్షియల్ కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను మోసం చేస్తోందని, ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల సమస్యలను పక్కనబెట్టి రాకీయాలు చేస్తున్నారంటూ జోగు రామన్న ఆరోపణలు చేశారు.

 ‘పత్తి ధర పెంచడంలో ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్ అయ్యారు. గుజరాత్ తరహాలో ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇక్కడి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. కీలకమైన పత్తి కొనుగోళ్ల సమయంలో పార్టీ సమావేశాల పేరిట ఎమ్మెల్యే డుమ్మా కొడుతున్నారు. అన్నదాతలు రోడ్దేక్కితే రాత్రికి వచ్చి ధర నిర్ణయించారు’ అని విమర్శలు చేయడంతో రాజకీయ దుమారం లేపింది.

రాజీనామకు సిద్ధం: ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

గుజరాత్ లో సీసీఐ ఒక్క రూపాయి ఎక్కువ పెట్టి పత్తి కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గుజరాత్​లో పత్తి ధర ఎక్కువ ఉందని జోగు రామన్న నిరూపిస్తే అక్కడి నుంచి అసెంబ్లీకి నా రాజీనామా లెటర్ పంపిస్తా. ఆదిలాబాద్ జిల్లా పత్తి కొనుగోళ్ల విషయంలో అనవసరంగా జోగు రామన్న రాద్దాంతం చేస్తున్నారు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ మార్కెట్ కు రైతులు పత్తి తీసుకువస్తే నాలుగైదు రోజులు పత్తిని ఎండబెట్టుకుంటేనే కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉండేది.

 ఈవిషయాన్ని మరిచిపోయారా?. మొన్న రైతులు ధర్నా చేస్తుంటే నువ్వు ఎక్కడున్నవ్? రైతులు ఆందోళన చేస్తున్నారని అన్ని కార్యక్రమాలు వదిలేసి హుటాహుటిన అదిలాబాద్ కు వచ్చి రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ తో కలిసి వ్యాపారులను ఒప్పించి పత్తి కొనుగోలు జరిగిగేలా చూశా. రాజకీయాల పాలసీలపైనే మాట్లాడుకుందాం. తెలిసీ తెలియనట్టు మాట్లాడి పరువు పోగొట్టుకోవద్దు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం మానుకోవాలి. లేదంటే నేను, నా కార్యకర్తలు మాటలు మొదలుపెడితే నీకే కష్టమైతది’ అని హెచ్చరించారు.

మద్దతు దక్కడం లేదు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ధర రూ.7521గా నిర్ణయించారు. ప్రైవేట్ వ్యాపారులు మొదటి రోజు తేమ లేకుండా రూ. 6,540 చెల్లించగా, రెండో రోజు నుంచి తేమ ఆధారంగా కొనుగోలు చేస్తూ ధరలో కోత విధిస్తున్నారు. రూ.7,120 ధర ప్రకటించినప్పటికీ తేమను బూచిగా చూపుతూ రైతులను ముంచుతున్నారు. 8 శాతం తేమ ఉన్నా రూ.7,120 చెల్లిస్తున్నారు. కానీ ప్రైవేట్ వ్యాపారులు మాత్రం అంత ధర కూడా ఇవ్వడం లేదు. చాలా మంది రైతులకు రూ.6,500 మద్దతు ధర కూడా దక్కడం లేదు. మార్కెట్ రైతులు ధర లేక నష్టపోతుంటే.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటు వైపు కన్నెత్తి చూడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపి రూ.8 వేలకు తగ్గకుండా ధర కల్పించేలా చూడాలని కోరుతున్నారు.