పత్తి దిగుబడి రాలేదని రైతు సూసైడ్‌‌

జైనూర్, వెలుగు : పత్తి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆసిఫాబాద్‌‌ జిల్లా జైనూర్‌‌ మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జైనూరు మండలం పట్నాపూర్‌‌ గ్రామానికి చెందిన రైతు డక్రే రాందాస్‌‌ (44) తనకున్న రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పంట సరిగా ఎదగక ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. 

దీంతో మనస్తాపానికి గురైన రాందాస్‌‌ గురువారం సాయంత్రం గ్రామ శివారులో పురుగుల మందు తాగి స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న రాందాస్‌‌ భార్య శకుంతల తన మరిది దేవిదాస్‌‌, అల్లుడితో కలిసి ఉట్నూర్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు రాందాస్‌‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. శకుంతల ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు జైనూర్‌‌ ఎస్సై సాగర్‌‌ చెప్పారు.