- రెండు నెలలపాటు అమలులో ఉంటుందన్న కాన్సులేట్ జనరల్
నిర్మల్, వెలుగు : దుబాయ్‌తో పాటు నార్తర్న్ ఎమిరేట్స్‌లో ఉంటూ వీసా కాలపరిమితి ముగిసిన భారతీయులంతా క్షమాభిక్ష స్కీమ్‌కు అప్లై చేసుకోవాలని అక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన జారీ చేసింది. ఈ క్షమాభిక్ష స్కీమ్ రెండు నెలల పాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలనుకునేవారు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్‌లోగానీ, బీఎల్‌ఎస్ కేంద్రాల్లో గానీ సంప్రదించాలని ఆఫీసర్లు సూచించారు. క్షమాభిక్షలో భాగంగా జారీ చేసే ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ను ఫ్రీగా జారీ చేయనున్నట్లు తెలిపారు. తమ రెసిడెన్స్ ఫ్రూఫ్‌ను రెగ్యులరైజ్ చేసుకునే వారంతా మినీ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోవాలని, ఈసీ కోసం కాన్సులేట్‌లో అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.
ఇందుకోసం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, దుబాయ్ అవీర్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఫెసిలిటేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఫెసిలిటేషన్ కౌంటర్లు ఈ నెల 22న మొదలై రెండు నెలల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. అప్లై చేసుకున్న వారందరికీ మరుసటి రోజే ఈసీలను జారీ చేయనున్నామన్నారు. గైడెన్స్ కోసం ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్‌లోని కాంటాక్ట్ పాయంట్లను కూడా సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.