- మూసి వేసే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని కాపాడుకునేందుకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి పరిరక్షణ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మనిరాంసింగ్, ఉపాధ్యక్షుడు చిప్ప నర్సయ్య, మత్తమారి సూరిబాబు, సిద్ధంసెట్టి రాజమౌళి, గెల్లి జయరాం యాదవ్ మాట్లాడారు. ఏరియా ఆస్పత్రిని పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. ఏరియా ఆసుపత్రిని మూసివేసేందుకు ఏరియా జీఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఆస్పత్రిలోని మెయిన్ మెడికల్ స్టోర్స్‌ను మూసివేయించారని మండిపడ్డారు.
ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చేసే అవకాశాలున్నప్పటికీ కుట్రపూరితంగా వైద్య నిపుణులు, వైద్యసిబ్బందిని నియమించడంలేదని ఆరోపించారు. బెల్లంపల్లిలో 10 వేల మంది రిటైర్డ్ కార్మికులు, వివిధ బొగ్గు గనుల్లో పనిచేస్తున్న 5 వేల మంది కార్మికులు ఉన్నారని.. వారి ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని ఆస్పత్రిని మూసివేయకుండా సింగరేణి సీఎండీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిరక్షణ కమిటీ నాయకులు రత్నం ఐలయ్య, ఎండీ అఫ్జల్, సోకాల శ్రీనివాస్, డీఆర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.