మెదక్​లో పోటాపోటీగా ప్రచారం

  • మిగిలింది ఒక్కరోజే
  • ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్తిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు
  • వీలైనంత మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నాలు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉంది. పోలింగ్​ఈ నెల 13న జరుగనుండగా ఎలక్షన్​ కమిషన్​నిబంధన ప్రకారం 48 గంటల ముందు అంటే 11న సాయంత్రం ప్రచారం ముగించాలి.  లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి మెదక్​, జహీరాబాద్ లోక్​సభ నియోజకవర్గ స్థానాల్లో పోటీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ సమావేశాలు, ర్యాలీలు, రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​ లు, బహిరంగ సభలు నిర్వహించాయి.

కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్​రెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్​ రావు​కు మద్దతుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గోవా సీఎం ప్రమోద్​ సావంత్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి, బీఆర్ఎస్​ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రచార సభల్లో పాల్గొన్నారు. గురువారం వరకు సభలు కొనసాగగా, పోలింగ్​తేదీ సమీపించడంతో ఫీల్డ్​ లెవల్​ప్రచారం మొదలు పెట్టారు.

ప్రచార గడువు ముగియడానికి 48 గంటల సమయం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​పార్టీలు ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టాయి. మెదక్ లోక్​ సభ నియోకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు.

పోలింగ్ బూత్​ ల వారీగా ఓటర్ లిస్ట్​లు పట్టుకుని వీలైనంత వరకు ప్రతి ఓటరను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.  లోక్​సభ నియోజకవర్గ  పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 

జహీరాబాద్ సెగ్మెంట్ లో..

జహీరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో గడిచిన కొద్ది రోజులుగా ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు, ఇతరులు ప్రచార ఆర్భాటాలు ముమ్మరం చేస్తూ ఎన్నికల హామీలు ఇస్తూ వచ్చారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానాఅగచాట్లు పడుతున్నారు. మొన్నటి వరకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచారం పూర్తి చేయడంతో ఆయా పార్టీలో జోష్ నెలకొంది.

మాజీ సీఎం కేసీఆర్ పుల్కల్ మండలం సుల్తాన్​పూర్, పటాన్​చెరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ, రోడ్ షో కార్నర్ మీటింగ్ లో పాల్గొని జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించి పార్లమెంట్​కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అల్లాదుర్గం వద్ద ఇటీవల నిర్వహించిన విశాల జనసభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై బీజేపీ అభ్యర్థి,  సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ను గెలిపించాలని జహీరాబాద్ పార్లమెంట్ ఓటర్లను కోరారు. ఇలా అగ్రనేతల సభల ద్వారా ఉత్సాహంగా ఉన్న సెకండ్ క్యాడర్ నేతలు

కార్యకర్తలు రానున్న 24 గంటల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో విలక్షణమైన నియోజకవర్గంగా పేరొందిన జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఇక్కడ లింగాయత్, మున్నూరు కాపు, మైనార్టీ, గిరిజన ఓటర్లు అధికంగా ఉండడంతో ఈ ఎన్నిక మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాల్ గా మారింది.