మెదక్​లో పెరిగిన కాంగ్రెస్​ గ్రాఫ్

  • మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక ఓట్లు
  • ప్రతీ రౌండ్​లో బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ  
  • 2.8 శాతం ఓట్ల తేడాతో  రెండో స్థానం  
  • 2019  కంటే ఈసారి  1.5 లక్షల ఓట్లు అధికం 
  • బీఆర్​ఎస్​కు  మూడో స్థానం 

మెదక్, వెలుగు: మెదక్​ పార్లమెంట్​ పరిధిలో కాంగ్రెస్​ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.   2019 లోక్​సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్నికల్లో లక్షా 52 వేల ఓట్లు పెరిగాయి.   కేవలం 2.8శాతం ఓట్ల తేడాతో    బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావుకు  గట్టిపోటీ ఇచ్చింది. కౌటింగ్​ మొదటి రౌండ్​ నుంచీ  పోటీ పడుతూ నువ్వా నేనా అని ఉత్కంఠ కొనసాగింది.  లెక్కింపు పూర్తయ్యే సరికి  రఘునందన్​ రావ్  కేవలం 39,139 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే  బయటపడగా..  కంచుకోటగా ఉన్న బీఆర్​ఎస్​ను కాంగ్రెస్​ మూడో స్థానంలోకి నెట్టింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో నూ  కాంగ్రెస్ కు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో   4,20,881 ఓట్లు రాగా  ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ  4,27,899 ఓట్లు వచ్చాయి.  

అప్పటికంటే ఇప్పుడు మరో 7,023 ఓట్లు పెరిగాయి.  కాగా  సంగారెడ్డి, నర్సాపూర్​, గజ్వేల్​సెగ్మెంట్లలో బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లను, పటాన్​ చెరులో బీఆర్​ఎస్​ కన్నా ఎక్కువ ఓట్లను  కాంగ్రెస్​ సాధించింది.    రాష్ట్రంలో కాంగ్రెస్​  అధికారంలోకి  రావడంతోపాటు, బీఆర్​ఎస్​ పై ఉన్న వ్యతిరేకతతో  ఎంపీ సీటు  గెలవాలన్న లక్ష్యంగా కాంగ్రెస్​ నీలం మధును బరిలోకి దించింది. బీఆర్​ఎస్​  సిట్టింగ్​ స్థానం, మరోవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్​ ఉండగా.. కాంగ్రెస్​ అభ్యర్థి నీలం మధు తనదైన మార్క్​ చూపించారు. 

పెరుగుతూ వచ్చిన గ్రాఫ్

1998 లోక్‌‌సభ ఎన్నికల వరకు అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్​ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. చివరి సారిగా 1998లో కాంగ్రెస్​  అభ్యర్థి బాగారెడ్డి మెదక్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నుంచి ఆ పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. అప్పటి నుంచి ప్రస్తుత 2024 ఎన్నికల వరకు  కాంగ్రెస్​ ఓడినా..  ఎన్నికలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్​కు ఓట్లు పెరుగుతూ వచ్చాయి. 2014లో  టీఆర్​ఎస్​ నుంచి కేసీఆర్​ పోటీలో ఉండగా.. కాంగ్రెస్​ పార్టీ  శ్రావణ్ కుమార్​ రెడ్డిని  పోటీలో దింపి, 21.87శాతంతో రెండో స్థానంలో  నిలిచింది.  అనంతరం జరిగిన బై ఎలక్షన్స్​లోనూ  రెండోస్థానంలో నిలువగా.. 2019లో   కాంగ్రెస్​కు 19, 158 ఓట్లు పెరిగాయి.  2024 ఫలితాల్లో  ఏకంగా 1,52, 457 పెరిగి, 31.17శాతం ఓట్లు రాబట్టి  ప్రభావం చూపింది. 

బీజేపీ, బీఆర్​ఎస్​కు దీటుగా.. 

 మూడు లోక్​ సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ సారి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్​ పార్టీ క్యాండిడేట్​ను మార్చింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఎస్పీ నుంచి కాంగ్రెస్​ లో చేరిన  నీలం మధుకు టికెట్​ కేటాయించింది.  లోక్​ సభ ఎన్నికల్లో  విజయం సాధించాలనే లక్ష్యంతో  బరిలోకి దిగిన కాంగ్రెస్​ తనదైనప్రభావాన్ని చూపింది.  కాంగ్రెస్​ ప్రత్యర్థి పార్టీ లైన బీజేపీ, బీఆర్ఎస్ లు ఓసీ అభ్యర్థులను బరిలో దించడాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ అభ్యర్థి అయిన నీలం మధును కాంగ్రెస్​ బరిలోదించింది. 

లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలో 50 శాతానికి పైగా ఓటర్లు బీసీలే ఉండటం, ముదిరాజ్​ సామాజికవర్గంలో మధుకు మంచి పేరుండటంతోపాటు, రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ సారి లోక్​ సభ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ప్రచారం నిర్వహించింది.  మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి పలు అంశాలు దోహదపడ్డాయి.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, ఆరు గ్యారెంటీల అమలు దిశగా చర్యలు చేపట్టడం, ఆగష్టు 15లోపు  రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అంతేగాక పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీ  ఓట్లు క్రాస్ అయి కాంగ్రెస్ కు పడ్డాయి.