- సీనియర్ కార్యకర్తలకు ప్రియారిటీ లేదని మండిపాటు
- కార్యకర్తలే పార్టీకి బలమన్న ఎమ్మెల్యే రోహిత్ రావు
రామాయంపేట, వెలుగు: రామాయంపేటలో సోమవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా జరిగింది. పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల కార్యకర్త ల సమావేశం నిర్వహించగా సీనియర్ కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, నిన్న మొన్న వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారని కొంతమంది కార్యకర్తలు నాయకులపై మండిపడ్డారు.
సమస్యలు చెబుదామనుకుంటే ఎమ్మెల్యే పీఏ ఫోన్ లేపడం లేదని ఆరోపించారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో ఎమర్జెన్సీ ఉంటేనే ఫోన్ చేయాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని తెలిపారు. ప్రతీ కార్యకర్త ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలే ఈ లొల్లి పెట్టారని ఇది సరైంది కాదన్నారు. కార్యకర్తలు సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. పదేళ్లలో జరగనిది మూడు నెలల్లో అభివృద్ధి జరుగుతుందా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ త్వరలో కనుమరుగు కాక తప్పదన్నారు. కార్యక్రమంలో సుప్రభాత రావు, రాంచంద్రాగౌడ్, రమేశ్ రెడ్డి, యాదగిరి, మహేందర్ రెడ్డి, నాగులు ఉన్నారు.