అప్పుడు తగ్గిండు.. ఇప్పుడు నెగ్గిండు

  • ఎమ్మెల్యేగా మరొకరికి చాన్స్ ఇచ్చి ఎంపీగా గెలిచిన సరేశ్​ షెట్కార్
  • నారాయణఖేడ్​లో పదేళ్లుగా తిష్టవేసిన బీఆర్ఎస్​కు పెద్ద ఎదురుదెబ్బ
  •  కంచుకోటను చేజిక్కించుకున్న కాంగ్రెస్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి ప్రస్తుతం ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆ ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్లు ఆశించారు. పార్టీ హై కమాండ్ మాత్రం షెట్కార్ కు టికెట్ ఇచ్చి బీఫామ్ అందజేసింది.

టికెట్ ఆశించి భంగపడ్డ సంజీవరెడ్డి చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడ బీఆర్​ఎస్ పదేళ్లుగా పాతుకుపోయి ఉంది. సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి కలిస్తేనే ఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయని భావించిన కాంగ్రెస్ పెద్దలు షెట్కార్​ను బుజ్జగించాయి. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సురేశ్​షెట్కార్​ పోటీ నుంచి తప్పుకుని సంజీవరెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై 6,546 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

ఎంపీగా గెలిచి..

ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న సురేశ్ షెట్కార్ కు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ హై కమాండ్ ఎంపీ టికెట్ ఇచ్చింది. దీంతో షెట్కార్ గెలుపు కోసం ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన అనుచరులు కలిసికట్టుగా పనిచేసి సక్సెస్ అయ్యారు. ఫలితంగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో పదేళ్లుగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ 5,23,919 ఓట్లు సాధించి బలపడింది. జహీరాబాద్ ఎంపీగా సురేశ్ షెట్కార్ సమీప బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై 47,893 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ రెండు పదవులు దక్కించుకోగలిగింది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి ఒకటవడంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు చెక్ పెట్టగలిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ప్రస్తుతం ఖేడ్ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రజలు
 ఆశిస్తున్నారు.