కలెక్టరేట్​ ముట్టడికి బీజేవైఎం ప్రయత్నం .. అడ్డుకున్న పోలీసులు

మెదక్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ శుక్రవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముట్టడికి ప్రయత్నించారు.  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీశ్, ప్రధాన కార్యదర్శి భరత్, ఉపాధ్యక్షుడు ప్రశాంత్, నర్సాపూర్​ అసెంబ్లీ కన్వీనర్​ శ్రీకాంత్​, నాయకులు మధు, రాజు, రంజిత్​ తదితర కార్యకర్తలు తరలిరాగా కలెక్టరేట్​ మెయిన్​ గేట్​ వద్దే పోలీసులు వారిని అడ్డగించారు.  కలెక్టరేట్​ ముట్టడికి ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకును పీఎస్​కు తరలించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీశ్​ మాట్లాడుతూ కాంగ్రెస్​ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. వెంటనే జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని, గ్రూప్స్ లో పోస్టులు పెంచాలని, డీఎస్సీ అభ్యర్థులు  చదువుకునేందుకు మూడు నెలల గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపేదిలేదని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే  భవిష్యత్​లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు.

సిద్దిపేట రూరల్: నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నీలం దినేశ్ అన్నారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడిని నిర్వహించగా పోలీసులు అరెస్టు చేసి పీఎస్​కు తరలించారు. ఈ సందర్భంగా దినేశ్​ మాట్లాడుతూ ప్రభుత్వం మెగా డీఎస్సీ ని ప్రకటించడంతో పాటు జీవో నెంబర్46 ను రద్దు చేయాలని లేనిపక్షంలో సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేశ్, సలేంద్ర రాజు, విజయ్, నవీన్ రెడ్డి, రవీందర్, కల్యాణ్ దాస్ పాల్గొన్నారు.