కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు

సిద్దిపేట, వెలుగు : పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మంగళవారం పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించగా ఇదే సమయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రుణమాఫీ పై ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలు సమావేశాన్ని నిర్వహించారు.

 దీంతో రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం వుండటంతో పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తోపాటు బీజేఆర్​ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పొన్నాల చౌరస్తా నుంచి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా పట్టణంలోకి రాగా ముందస్తుగా అనుమతి ప్రకారం బీజెఆర్ చౌరస్తా నుంచి బైపాస్ రోడ్డులోకి మల్లించారు . 

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించడానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో బైపాస్ రోడ్డు మీదుగా వెల్లిపోయారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు చేరు కోగా వారిని పోలీసులు నియంత్రించారు.