పత్తి మొక్కలను పీకేసిన ఫారెస్ట్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ఫారెస్ట్ ​ల్యాండ్​లో సాగు చేశారనే కారణంతో పూతకొచ్చిన పత్తి మొక్కలను ఫారెస్ట్​ ఆఫీసర్లు మంగళవారం రాత్రి పీకేశారని నెన్నెల మండల కేంద్రానికి చెందిన దంపతులు పోశం-–పద్మ నెన్నెల పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల శివారు సర్వే నం.672/25లోని 5 ఎకరాల్లో 20 ఏండ్లుగా ఆ దంపతులు పంట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2018లో డిజిటల్​పట్టా పాస్​ పుస్తకం కూడా  వచ్చింది. అయినప్పటికీ ఇది ఫారెస్ట్ ల్యాండ్​ అని​అధికారులు పూత దశలో ఉన్న పత్తి మొక్కలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పట్టాలు లేని పెత్తందారలు వందలాది ఎకరాలు కబ్జా చేసినా అటు వైపు కన్నెత్తి చూడకుండా అన్ని పత్రాలు ఉండి అర్హత కలిగిన గిరిజన రైతులపై జులూం చెలాయించడం సరికాదన్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఫారెస్ట్​అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆ రైతు దంపతులు కోరారు. ఈ విషయమై కుశ్నపల్లి డిప్యూటీ రేంజ్​ఆఫీసర్​లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. పీకేసిన పత్తికి, ఫారెస్ట్​ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమపై అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.