అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి

  •     గ్రీవెన్స్ లో రైతుల ఫిర్యాదు

సంగారెడ్డి టౌన్, వెలుగు : హత్నూర గ్రామం పరిధిలోని మల్లన్న గుట్ట సర్వేనెంబర్ 116 లో గల ప్రభుత్వ భూమిలో 16 ఏళ్లుగా క్రషింగ్ మిషన్ నిర్వహిస్తున్నారని, 5 ఎకరాలకు పర్మిషన్ ఉంటే యాజమాన్యం 25 ఎకరాల వరకు అక్రమంగా మైనింగ్ పాల్పడడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని బాధిత రైతులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్ తో పాటు అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్​వో పద్మజారాణి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా రాయకోడ మండల కేంద్రానికి చెందిన మల్కాపూర శోభారాణి తన ప్రమేయం లేకుండా సోదరుడు భూ బదలాయింపు కోసం స్లాట్ బుక్ చేశారని దాన్ని రద్దు చేయాలని కోరారు.  

ఆందోల్ చెరువు కట్టపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వీటిపై మూడేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ గాజుల అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. కోహిర్ మండలం బడంపేటకు చెందిన బేకరీ నరసింహులు మృతికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలంటూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట టౌన్ : ప్రజావాణి ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని  కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్​ఆఫీసులో అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడూ పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా ప్రజావాణికి మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయన్నారు.  వాటిని వెంటనే సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్​వో నాగ రాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, వివిధ జిల్లాల అధికారులు  పాల్గొన్నారు. 

మెదక్​జిల్లాలో..

మెదక్ : కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 91 అర్జీలు వచ్చాయి.  ఇందులో భూ సమస్యలకు సంబంధించి 30, పెన్షన్​లకోసం 10, డబుల్ బెడ్ రూమ్ ల కోసం 3,  ఉద్యోగం కోసం 2, ఇతర అంశాలపై 46  ఆర్జీలు రాగా వాటిని పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, డీఈవో రాధాకిషన్​ పాల్గొన్నారు.