జహీరాబాద్​లో నువ్వా నేనా! .. కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్​ ఫైట్​ 

 

  • హ్యాట్రిక్ కోసం సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ విశ్వ ప్రయత్నాలు
  • పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న కాంగ్రెస్ 
  • కనిపించని బీఆర్ఎస్ ప్రభావం
  • పరువు దక్కించుకునేందుకు తాపత్రయం

సంగారెడ్డి, వెలుగు :  జహీరాబాద్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్, బాన్సువాడల్లో బీఆర్​ఎస్​గెలుపొందగా..నారాయణ ఖేడ్, అందోల్, జుక్కల్, ఎల్లారెడ్డి స్థానాలను కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. జహీరాబాద్​ లోక్​సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ ​షెట్కర్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంట్ నుంచి మొత్తం 19 మంది పోటీ పడుతుండగా తొమ్మిది మంది వివిధ పార్టీల నుంచి తలపడుతున్నారు. మరో పదిమంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు కొనసాగే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ​నాన్ లోకల్ కావడంతో ఆ పార్టీ సెకండ్ క్యాడర్ అసంతృప్తితో ఉంది. ఎవరైనా పెద్ద లీడర్ వస్తే తప్ప బీఆర్ఎస్ ప్రచారం కొనసాగడం లేదు.  

హ్యాట్రిక్ కోసం పాటిల్ తపన

బీజేపీ క్యాండిడేట్ బీబీ పాటిల్ హ్యాట్రిక్ గెలుపు కోసం  ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి జహీరాబాద్ ఎంపీగా గెలుపొందగా, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీ తరఫున బరిలోకి దిగారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి సెగ్మెంట్​లో బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తరఫున నిలబడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్​ను ఓడించి ఊపు మీదున్న బీజేపీ క్యాడర్​.. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తోంది. ఇక్కడ ప్రధాని మోదీ ఛరిష్మా పని చేస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ లీడర్లు, యువకులు బీబీ పాటిల్ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈ సెగ్మెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోల్, బాన్సువాడ, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పట్ల అసంతృప్తితో ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్లను క్యాచ్ చేసి బీజేపీలో చేర్పించడంలో పాటిల్ సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగారాం, నారాయణ ఖేడ్ నుంచి నాగలిగిద్ద జడ్పీటీసీ రాజు రాథోడ్ బీజేపీలో చేరారు. వీరి చేరికలతో బీజేపీకి అదనపు బలం వచ్చినట్టయ్యింది.  

కాంగ్రెస్​లో నూతనోత్సాహం

కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్​షెట్కర్ గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పడిన మొదట్లో ఎంపీగా పనిచేసిన షెట్కర్ చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ​అధికారాన్ని దక్కించుకోవడం, ఆరు గ్యారెంటీల స్కీముల ప్రభావం తమను గెలిపిస్తాయంటున్నారు. పైగా ఈ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందడం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీనికి తోడు ఆ మధ్య జహీరాబాద్​కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కొడుకు ఐడీసీ మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, జరాసంగం జడ్పీటీసీ వినీల నరేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మహంకాల్ సుభాష్, ఇప్పేపల్లి సొసైటీ చైర్మన్ కిషన్ పవార్, జహీరాబాద్ కు చెందిన ఏడుగురు మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, ఎంపీపీ మోతీ బాయ్, శంకరంపేట నుంచి నలుగురు ఎంపీటీసీలు, ముగ్గురు మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి మరింత బూస్ట్ ఇచ్చింది. 

బీఆర్ఎస్ ఎదురీత

జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురీదుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన మార్పులు జహీరాబాద్ లోక్ సభ పరిధిలో కూడా బీఆర్ఎస్ కు మైనస్​గా మారాయి. మొదట ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బీజేపీలో చేరడంతో వలసల పరంపర వరదలా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్యాడర్ దాదాపు ఖాళీ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఈ సెగ్మెంట్ కు కొత్త వ్యక్తి కావడంతో ఆ పార్టీ క్యాడర్​లో అసంతృప్తులు ఎక్కువయ్యాయి. దీంతో  ఆ పార్టీ సెకండ్ క్యాడర్ కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు. పార్టీ ఫిరాయింపుల ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా కుదిపేస్తున్నప్పటికీ..అక్కడక్కడా కొన్ని మండలాల్లో పార్టీ అభిమానులు కొందరు సొంతంగా ప్రచారం చేస్తూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. అయితే, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాన్సువాడ మినహా జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మ్యాగ్జిమం తన ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది.