ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన కష్టాలు

కోల్ బెల్ట్, వెలుగు: ఐదేండ్లుగా రోడ్డు లేకుండా అవస్థ పడుతున్న కాలనీవాసులకు దారి కష్టం తీరింది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో రోడ్డు వేయడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం మందమర్రిలోని ఇందు గార్డెన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీవాసులు మాట్లాడారు. తమ కాలనీకి ఎన్నో ఏండ్లుగా రోడ్డు సౌకర్యం లేదని, ఈ విషయాన్ని అనేకసార్లు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో కాంగ్రెస్ లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యకుడు బండి సదానందం ద్వారా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి తమ సమస్య చెప్పుకోగా రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారని తెలిపారు. 

హామీ నెరవేర్చుతూ ఇటీవలే కాలనీలో రోడ్డు వేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సదానందం మాట్లాడుతూ..పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాకా కుటుంబం నాలుగు దశాబ్దాలుగా  ప్రజల సమస్యలు తీర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. కాలనీకి రోడ్డు వేయాలని అడిగిన వెంటనే ఎమ్మెల్యే వివేక్ చొరవ చూపారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.