ఆసిఫాబాద్/నేరడిగొండ/తిర్యాణి, వెలుగు: వన మహోత్సవం టార్గెట్ను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీటీజీ కాలేజీలో డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అధ్యక్షతన నిర్వహించిన వన మహోత్సవానికి కలెక్టర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 53 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 50 శాతానికి పైగా మొక్కలు నాటినట్లు చెప్పారు.
ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉందని, ఈ నెలాఖరు నాటికి లక్ష్యం పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నాటిన మొక్కలు బతికేలా చూడాలన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు అందిస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీటీడీఓ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.
మొక్కలు జీవనాధారం
మొక్కలు మానవ మనుగడకు జీవనాధారం అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలం వడూర్ శివారంలో ఫారెస్ట్ ఆఫీసర్లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఎఫ్ఆర్వో గణేశ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ డా.జహీర్ తదితరులు పాల్గొన్నారు. తిర్యాణి మండలం కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎఫ్ ఆర్వో శ్రీనివాస్, గిన్నెదారి ఇన్చార్జి ఎఫ్ఆర్వో ప్రవీణ్ కుమార్, డిప్యూటీ ఎఫ్ఆర్వో సంతోశ్, మాజీ ఎంపీపీ శ్రీదేవి, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.