వనమహోత్సవం టార్గెట్ పూర్తిచేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసేలా అధికారులు కృషి చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఓ సురేందర్, డీపీఓ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ భుజంగరావుతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని, మొక్కలను సంరక్షించుకోవాలని కలెక్టర్​కోరారు. జిల్లాలో 53 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 35 శాతం మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ నెల చివరిలోగా టార్గెట్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణమాఫీ అమలు చేయాలి

అర్హత గల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించి రుణమాఫీ పథకం అమలును పరిశీలించారు. బ్యాంకు అధికారులకు పలు సూచనలు చేశారు.