సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలోని 13 రకాల యూనిట్లను ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ అయ్యేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, డీపీఎంలు, ఏపీఎంలతో రివ్యూ నిర్వహించారు. మదర్ పౌల్ట్రీ ఫార్మ్ యూనిట్ టార్గెట్ వచ్చేనెల మొదటి వారంలోగా పూర్తిచేయాలన్నారు. డైరీ ఫాం, కుట్టుపని కేంద్రాలు, మొబైల్ చేపల విక్రయ కేంద్రాలు, వ్యవసాయ యంత్ర సామగ్రి అద్దె యూనిట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కేంద్రాలతోపాటు 13 రకాలను ఈ నెలాఖరులో గ్రౌండింగ్ చేయాలన్నారు.
లక్ష్యాలను చేరుకోలేని ఏపీఎంలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పీడీ, డీఆర్ డీఓ అధికారిని ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకొని రుణాలు మంజూరు చేయించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, మెప్మా పీడీ గీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.