పోషణ్ అభియాన్‌ ను పక్కాగా అమలు చేయాలి :కలెక్టర్‌ రాజర్షిషా

గుడిహత్నూర్, వెలుగు : గిరిజన ప్రాంతాల్లో పోషణ్​అభియాన్‌ కార్యమ్రాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం మర్కగూడ, గిన్నెర, పాటగూడ, లాల్‌టేకిడి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న వంతెనలు, రోడ్లను పరిశీలించారు. అనంతరం ఆయా అంగన్​వాడీ కేంద్రాల్లో నిల్వ ఉన్న సరుకులు, రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి చిన్నారులకు వడ్డించారు.

మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేస్తున్న హాజరు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించి మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్​వాడీ టీచర్లకు సూచించారు. బలమైన ఆహారం అందించినప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆయన వెంట డీఆర్‌డీవో సాయన్న, పీఆర్‌ఈఈ శివరామ్, పీఆర్‌డీఈఈ రమేశ్, ఏసీడీపీవో మిల్కా, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.