సమన్వయంతో పనిచేస్తేనే సంక్షేమం : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. జడ్పీ సభ్యుల పదవీకాలం ముగిసిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ఆయన​ హాజరయ్యారు. ఐదేండ్లపాటు జడ్పీ సభ్యులు చేసిన పనులను అభినందించారు. అనంతరం సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్​ అడ్డి భోజరెడ్డి, సీఈవో రత్నమాల, జడ్పీ మాజీ చైర్మన్​ జనార్దన్​ రాథోడ్​, తదితరులు పాల్గొన్నారు. 

ప్రత్యేక అధికారిగా బాధ్యతలు

జిల్లా పరిషత్ పదవీకాలం ఈ నెల 4తో ముగియడంతో శుక్రవారం కలెక్టర్​ రాజర్షి షా జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్​కు జడ్పీ మాజీ చైర్మన్​ రాథోడ్​ జనార్దన్​, సీఈవో రత్నమాలలు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఆదిలాబాద్: వన మహోత్సవం కింద ఆదిలాబాద్​ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్​లో శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో మానిటరింగ్, కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ప్లాంటేషన్ పూర్తైన తర్వాత నాటిన మొక్కల పూర్తి వివరాలను పోర్టల్​లో అప్లోడ్ చేయాలన్నారు. మొక్కలు నాటే స్థలాలను మూడు రోజుల్లోగా పరిశీలించి, ఎక్కడ ఎన్ని నాటవచ్చో నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.

అటవీశాఖ అధికారులు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించేందుకు చొరవ చూపాలన్నారు. జిల్లాలో అన్ని శాఖలు, మున్సిపల్ పరిధిలో కలిపి 46 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, డీఆర్డీవో సాయన్న,  సంబంధిత శాఖల అధికారులు , ఎంపీడీవోలు, డీపీఎంలు, ఏపీఎంలు, ఎంపీవోలు, డ్వామా ఏవోలు, తదితరులు పాల్గొన్నారు.