రిమ్స్​లో మహిళా శక్తి  క్యాంటీన్ ​ఏర్పాటు : కలెక్టర్ ​రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రభుత్వం డీఆర్ డీఓ ద్వారా మహిళా శక్తి పథకం మహిళా శక్తి క్యాంటీన్​ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ​రాజర్షి షా తెలిపారు. క్యాంటీన్​ ఏర్పాటు కోసం స్థలాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. డీఆర్ డీఓ ఆధ్వర్యంలో క్యాంటీన్​ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేశామని, ఇందుకు బ్యాంక్ నుంచి ఋణం కూడా మంజూరైందని తెలిపారు. ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్​రెడ్డి త్వరలో రానున్నారని, క్యాంటీన్​కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం సదరం క్యాంప్​ను సందర్శించి వెయిటింగ్ లిస్ట్​లో ఉంచకుండా సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ఫ్రైడే.. డ్రైడే సందర్భంగా పట్టణంలోని మహాలక్ష్మివాడలోని అమ్మవారిని దర్శించుకున్నారు. డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్​ రాథోడ్, డీవైఎస్​ఓ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.