పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలుంటే డిసెంబర్ 12 లోగా తెలియజేయాలి: ఆదిలాబాద్ కలెక్టర్​ రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గుర్తించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 12 లోగా తెలియజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా కోరారు. మంగళవారం కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్ శ్యామలా దేవి, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియాతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా సిద్ధం చేసి ఈ నెల 7న జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామపంచాయతీల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 473 గ్రామ పంచాయతీలు, 3870  వార్డులు ఉండగా, 3888 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని.. ఏమైనా అభ్యంతరా లుంటే తెలియజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను 13న పరిష్కరించి తుది జాబితాను 17న ప్రచురించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో జితేందర్,  డీపీవో శ్రీలత, డీఎల్​పీవో ఫణీంద్ర, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట చర్యలు

నిర్మల్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సవరించిన ఓటరు జాబితా ప్రకారం నాలుగు కొత్త గ్రామ పంచాయతీలను కలుపుకొని మొత్తం 400 గ్రామపంచాయతీల్లో 3368 వార్డుల్లో 3368 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.

ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే మండల స్థాయిలో జరగనున్న సమావేశంలో అధికారులకు తెలియజేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీఎల్పీవో రమేశ్ పాల్గొన్నారు.