అర్జీలపై అలసత్వం వద్దు : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు:  గ్రీవెన్స్ లో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం చేయొద్దని ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు. గత వారం వరకు ఉన్న ఆయా శాఖలకు సంబంధించిన పెండింగ్ వివరాలు తెలుపుతూ వచ్చే వారంలోగా పరిష్కరించా లని, గ్రీవెన్స్ పోర్టల్​లో అప్​లోడ్ చేయాలని ఆదేశించారు.

ప్రజావాణిలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటానని ఆసిఫాబాద్​వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్ లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్జీదారులు అందించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్ ఇతర అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. 

గ్రీవెన్స్​కు రాని అధికారులకు మెమోలు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కలెక్టరేట్​లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్​సెల్​కు వివిధ శాఖల అధికారులు డుమ్మా కొడుతున్నారు. అంతేగాకుండా పిటీషన్లను సకాలంలో పరిష్కరించకుండా పెండింగ్​పెడుతున్నారు. ఇలాంటి వారిపై కలెక్టర్​ కుమార్​ దీపక్​ సీరియస్​అయ్యారు. గ్రీవెన్స్​కు రాకుండా, సకాలంలో పిటీషన్లు పరిష్కరించని అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవోను ఆదేశించారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్, లేబర్​ డిపార్ట్​మెంట్ల అధికారులకు మెమోలు జారీ చేసినట్టు ఏవో రాజేశ్వర్​తెలిపారు.