మహిళా శక్తి క్యాంటీన్, పౌల్ట్రీ ఏర్పాటుకు చర్యలు  :కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లాలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్, పౌల్ట్రీల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మహిళా శక్తి క్యాంటీన్, పౌల్ట్రీలపై జిల్లా సమైఖ్య సభ్యులతో శనివారం కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించారు.

మహిళా సంఘాల ద్వారా ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మైక్రో ఎంటర్ ప్రైజెస్, మీ సేవా కేంద్రాలు, స్టిచింగ్, మహిళా శక్తి క్యాంటీన్ గురించి మహిళా సమైక్య సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పౌల్ట్రీ మదర్ యూనిట్లు వివరాలపై సమీక్షించారు.

మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు పారదర్శకంగా ఉండాలని ఆదిలాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ, బోథ్​లో ఏర్పాటు చేయాలని, అందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. దస్నాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ టీచర్ రాకపోవడంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.