రామాయంపేట, వెలుగు : జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అధికారులను ధాన్యం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు.
మరో రెండు రోజుల్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇక్కడ రైస్ మిల్లుల్లో స్థలం లేక మహబూబ్నగర్ జిల్లా గద్వాలకు సైతం ధాన్యం పంపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామన్నారు. అంతకు ముందు దామరచెరు చేరుకుని అక్కడి అమ్మ ఆదర్శ పాఠశాలను సందర్శించి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకొన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహహీల్దార్ రజనీ, ఏవో రాజనారాయణ, పీఏసీఎస్ చైర్మన్పుట్టి నర్సింలు ఉన్నారు.