కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం కౌడిపల్లి మండలం వెల్మకన్నెలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కన్నా ఈసారి 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు చెప్పారు. కొనుగోళ్లు పూర్తయిన 300 సెంటర్లను మూసివేసినట్లు చెప్పారు. ఇంకా సుమారు 10 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
సర్కారు స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌడిపల్లి మండలం తునికి హైస్కూల్ లో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులకు రిపేర్లు చేయిస్తున్నట్లు చెప్పారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను జూన్ 5 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.